Monday, April 11, 2011

ఘంటసాల - పద్యమాల (హరిశ్చంద్ర సినిమా-03)

చంద్రమతీ లోహితాస్యులు కాలకౌశికుని వెంట
 వెళ్ళి పోతారు !

                           ********

కాలకౌశికుని వద్ద ధనము తీసుకున్న నక్షత్రకుడు
"ఈ సొమ్ము నే నిన్నిరోజులూ నీ వెంట తిరిగినందులకు
 దారిబత్తెముగా నాకు సరిపోయినది ! మరి మా
గురువుగారి సొమ్ము నెప్పుడిచ్చెదవని " హరిశ్చంద్రుని
అడుగుతాడు !
నిశ్చేష్టుడైన హరిశ్చంద్రుడు అంతలోనే తేరుకొని
" మహాశయా నన్నుకూడా ఎవరికైనా విక్రయించి
 ఋణ విముక్తుని చేయుడని" ప్రార్థిస్తాడు !
అప్పుడు నక్షత్రకుడు హరిశ్చంద్రుని కూడా
కాశీ పట్టణపు వీధులలో అమ్మజూపుతాడు !
వీరబాహుడనే ఛండాలుడు నక్షత్రకుడు అడిగిన సొమ్ము
చెల్లించి హరిశ్చంద్రుని కొనుక్కొని కాటికాపరిగా
నియమిస్తాడు !
        
                 ******

కాటికాపరిగా జీవితయానం సాగిస్తూ ,
శ్మశానంలో , హరిశ్చంద్రుడు :

రచన : బలిజేపల్లి
సంగీతం : సుసర్ల దక్షిణా మూర్తి
గానం : ఘంటసాల


06) || సీసము ||

కాబోలు, బ్రహ్మ రా - క్షస సమూహం బిది
ఘోషించు చుండె , ఋ - క్కుల , క్రమంబు


కాబోలు, వీరు వి - గత జీవ భాంధవుల్
అడరు చుండిరి , మహా - ర్తా రవముల


కాబోలు , వీరు ట - క్కరి భూత మాంత్రికుల్
నెమకు చుండిరి , కపా - లముల కొఱకు


కాబోలు నిది, పిశా - చీ బాంధవ శ్రేణి
వలలంపు భూవంపు - బంతి సాగె


|| తేటగీతి ||

చిట్లు చున్నవి కాబోలు - చితుల లోన
కాల్ప బడెడు శవాల, కం - కాళ సమితి!
ఇట, పెఠీలను రవములే - యెసగు చుండు
దిక్కు లన్నింట మార్మోత - పిక్కటిల్ల!

           
                   
                       ******

ఆహా ! ఎంత విచిత్రంగా ఉందీ శ్మశానం.
భగవాన్ , ఒకనాడు సకల భూ మండలాన్నీ
నా చే పాలింప జేసి , ఈనాడొక కాటి కాపరిగా
మార్చడం కేవలం నీ కృపే.
రారాజు నుంచి భిక్షకుని వరకూ
మహా విఙ్ఞాని నుంచి అఙ్ఞాని వరకూ
సకల ప్రాణి కోటికీ
ఈ శ్మశానమే అంతిమ రంగం చేసి
నీ సర్వ మానవ సమానత్వం
నిరూపించావు.
ఆహా ఏమి నీ లీల !!!!!

        
            
                 ******

కాటికాపరిగా జీవితయానం సాగిస్తూ ,
శ్మశానంలో , హరిశ్చంద్రుడు :


రచన : జా షు వా
సంగీతం : సుసర్ల దక్షిణా మూర్తి
గానం : ఘంటసాల


07) || సీసము ||

ఇచ్చోట-ఏ-సత్క - వీంద్రుని,కమ్మని
కలము,నిప్పుల లోన - కరగి పో యె !


ఇచ్చోట-ఏ-భూము - లేలు,రాజన్యుల
అధికార ముద్రిక - లంతరించె !


ఇచ్చోట -ఏ-లేత - ఇల్లాలి,నల్ల పూ
సల సౌరు,గంగలో - కలసి పోయె !


ఇచ్చోట ,ఎట్టి , పే - రెన్నికన్,గనుగొన్న
చిత్ర లేఖకుని,కుం - చియ,నశించె !


|| తేటగీతి ||

ఇది,పిశాచు లతో, నిఠ - లేక్ష ణుండు
గజ్జె కదలించి ఆడు , రం - గ స్థలంబు!
ఇది, మరణ దూత, తీక్ష్ణమౌ - దృష్టు లొలయ
అవని పాలించు , భస్మ సిం - హాసనంబు !!


పై రెండు పద్యాలూ వినాలంటే ఇక్కడ నొక్కండి " హరిశ్చంద్ర "
                       
                       *******

కాటికాపరిగా జీవితయానం సాగిస్తూ ,శ్మశానంలో ,
తమ దుస్థితికి చింతిస్తూ , హరిశ్చంద్రుడు :


రచన : బలిజేపల్లి
సంగీతం : సుసర్ల దక్షిణా మూర్తి
గానం : ఘంటసాల


08) || మత్తేభము ||

అకటా ! ఒక్కని పంచ, దాసి యయి ,య - ట్లల్లాడు ,ఇల్లాలి ,పా
ట్లకునై, కుందుదునా ? సువర్ణమయ డో - లా కే ళికిం బాసి, పొ
ట్టకు నై రో సి, తపించు, నా కొడుకు జా - డన్ గాంచి, దుఃఖింతునా ??
ఇక, ఈ, నీచపు, కాటి కాపరికి , నా - కై నేను , శోకింతునా ???


ఈ పద్యం వినాలంటే ఇక్కడ నొక్కండి " హరిశ్చంద్ర "

                           *******

నిత్యంశవాలతోనే సహ జీవనం చేస్తూ,
వైరాగ్యం పరాకాష్థకు చేరిన వేళ ,
జీవిత సత్యాన్ని తెలుసుకొన్న
హరిశ్చంద్రుడు :


రచన : బలిజేపల్లి
సంగీతం : సుసర్ల దక్షిణా మూర్తి
గానం : ఘంటసాల


09) || శా ర్దూ ల ము ||

మాయా మేయ జగంబె, నిత్య మని సం - భావించి , మోహంబు నన్
నా యిల్లా లని , నా కుమారు డని , ప్రా - ణంబుండు నందాక ,ఎం
తో ,యల్లాడిన ,ఈ శరీర మిపుడిం- దున్ ,కట్టె లన్ , గాలు చో
ఆ యిల్లాలును రాదు ! పుత్రుడును తో - డై  రాడు !! తప్పింప గన్ !!!

మాయా మేయ జగంబె....

ఈ పద్యం వినాలంటే ఇక్కడ నొక్కండి " హరిశ్చంద్ర "
           
                  

                           *******

శ్మశానంలో , చీకటిలో, కొరవితో తిరుగుతూ,
హరిశ్చంద్రుడు :

రచన : బలిజేపల్లి
సంగీతం : సుసర్ల దక్షిణా మూర్తి
గానం : ఘంటసాల


10) || మత్తేభము ||

చతురంభోధి పరీత , భూవలయ , ర - క్షాదక్ష ,జామీ కరా
యత , దండంబు ధరించు నీ కరమె , ఆ - హా ! ఇప్పుడి క్కాటిలో
చితిలో కాలుచు నున్న , ఈ కొరవి దా - ల్చెన్ !! నవ్య మాణిక్య రా
జిత , నీరాజన కాంతికిన్ , బదులు వ - చ్చెన్ , పూజనీయంబుగా!!!


ఈ పద్యం వినాలంటే ఇక్కడ నొక్కండి " హరిశ్చంద్ర "
                               
                               ******