Thursday, February 10, 2011

ఘంటసాల - పద్యమాల (గో ఘోష )

"పుష్ప విలాపం"
వీనుల విందుగా
విన్నారుగదా!
దానిని అనుకరిస్తూ
మరో మహానుభావుడు
వ్రాసిన ఈ
" గో ఘోష"
వినండి.

గో ఘో ష
రచన : సుబ్బారావు
సంగీతం మరియు గానం : ఘంటసాల


(1) || తేటగీతి ||
తూర్పు దిశ యందు సూర్యుండు - తొంగి చూడ
నిదుర మేల్కాంచి ఆనాడు - నేను , వేగ
పాలు పితుకంగ గోమాత - పాలి కరుగ
పల్కె నిట్టుల నేత్ర బా - ష్పములు కురియ


(2) || ఉత్పలమాల ||
మా మగవారు , మీ రనెడి - మాటల నెల్ల సహించి నేర్పుతో
భూమిని దున్నకున్నెడల - పొట్టలు నిండునె ? అట్టి మా పయిన్
తామస మేల మీకు ? ఇది - ధర్మమె ? క్రూరపు బుద్ధితోడ మ
మ్మీ మహి లోన గొట్టెదరు ! - మీ నర జాతికి జాలి యున్నదే ? 


(3) || ఉత్పలమాల ||
పాలును త్రాగుమా చిరుత - పాపల జూచి సహింప లేక , న
వ్వాలుకు ద్రోసి వేసియు చి - వాలున మా చనుబాలు పిండి , కం
చాలను పోసి త్రావెదరు - చల్లగ , బొజ్జలు నిండ మీరు , మ
మ్మేలను హింస బెట్టెదరు ? - మీ నర జాతికి జాలి యున్నదే ? 


(4) || తేటగీతి ||
అంబ అంబా యటంచును - ఆకటి కిని
అరచు మా బిడ్డలను గాంచి , - ఆత్మ లోన
పాప మని సుంత యైనను - పలుక బోరు !
జాలి లేనట్టి వారు మీ - జాతి వారు 


(5) || తేటగీతి ||
కండ లందున్న సత్తువ - కరుగు నంచు
భయము చే మీదు తల్లులు - పాలు నిడక
యున్న తరి , మిమ్ము జూసి మే - మోర్వ లేక
ప్రేమ తో మాదు పాలిడి - పెంచి నాము 


(6) || తేటగీతి ||
బుద్ధు డుదయించి నట్టి యీ - భూమి లోన
కలిగి నారలు మీకేల - కరుణ లేదు ?
ఆ మహాత్ముడు నడచిన - అడుగు జాడ
మాసి పోలేదు చూడుడీ - మహిని మీరు 


(7) || తేటగీతి ||
అనుచు ఘోషించు చున్న ఆ - యమ్మ గాంచి
కఠినమౌ నాదు హృదయమ్ము - కరగి పోయి
చింత తో నేని కేమియు - జేయ లేక
తిరిగి వచ్చితి యింటిలో - తెలియ జేయ

*********|| సమాప్తం ||********* 

ఘంటసాల
గాన
గాఢాభిమానులకు
మరొక విందు
" గో ఘోష "
పూర్తయ్యింది

ఆస్వాదించండి మరి.
ఇందులో 5,6,7 పద్యాలు
తిరిగి
వినిపిస్తాయి
గమనించండి.


click here " Gogosha "