Monday, April 4, 2011

ఘంటసాల - పద్యమాల (హరిశ్చంద్ర సినిమా-02)

ఆ విధముగా రాజ్యాన్ని విశ్వామిత్రునికి దానమిచ్చి
భార్యా పుత్రులతో కలసి కట్టు బట్టలతో నగరము
వదలి వెళ్ళబోతున్న హరిశ్చంద్రుని ఆపి ,
నా యాగ సంరక్షణ కొరకు ఇస్తానన్న ధనము
నిమ్మంటాడు విశ్వామిత్రుడు !
మహాత్మా ! నా కున్న దంతయూ మీకే దానమిచ్చితిని గదా !
మీ యాగ సంరక్షణా ధనము గూడా అందే గలదు !
స్వీకరింపుడని నుడివిన , ఆ హరిశ్చంద్రుని తో
విశ్వామిత్రుడు నా కిత్తునన్న ధనము నెవరికో
దానము జేసి నాకు లేదని యందువా అసత్యవాదీ !
అని దుర్భాష లాడెను !
చేయునది లేక ఆ ధనము చెల్లించుటకు హరిశ్చంద్రుడు
కొంత గడువు కోరెను !
దానికి సమ్మతించిన విశ్వామిత్రుడు తన శిష్యుడైన
నక్షత్రకుని వారి వెంట పంపుతూ రహస్యముగా
నక్షత్రకునితో "మనకు కావలసినది ధనము కాదు !
హరిశ్చంద్రునితో అసత్యమును పలికించుటయే నని
ఙ్ఞప్తి యందుంచు కొనుమని పలికెను !
            
            
                  *******

ఆ విధముగా నక్షత్రకుడు అనుసరించగా
హరిశ్చంద్రుడు భార్య చంద్రమతి తోనూ
కుమారుడు లోహితాస్యునితోనూ కలసి ఎన్నో
అష్ట కష్టముల నధిగమించి చివరికి
కాశీ పట్టణము చేరి కాశీ విశ్వేశ్వరుని దర్శించి
వేనోళ్ళ నుతించెను !
         
           
                *******

అప్పటికి విశ్వామిత్రుడిచ్చిన గడువు పూర్తికావచ్చినదని
నక్షత్రకుడు తొందరింప ,
స్వామీ నన్నెవరికయినా విక్రయించి మీ ఋణమును
తీర్చివేయుడని సలహా యిచ్చిన చంద్రమతితో
హరిశ్చంద్రుడు :


03) || ఉత్పలమాల ||

అంతటి రాజ చంద్రునకు - ఆత్మజవై , చతురంత కాంత వి
శ్రాంత యశో విశాలుని , త్రి - శంకు నృపాలుని ఇల్లు సొచ్చి , భా
స్వంత కుల ప్రసిద్ధి కొక - వన్నె ఘటించిన , గేస్తురాండ్ర మే
ల్బంతిని ! నిన్ను , ఒక్కనికి - బానిసగా తెగ నమ్ము కొందునే ?


ఈ పద్యం వినాలంటే ఇక్కడ నొక్కండి " హరిశ్చంద్ర "

గడువు లోపు ఋణము దీర్చుటకువేరే దారి
లేక ఇష్టం లేకపోయినా , బాధను దిగమ్రింగుకొని
చంద్రమతిని బానిసగా విక్రయించబూనుకొనిన
హరిశ్చంద్రుడు :


04) || సీసము ||

జవదాటి ఎరుగదీ - యువతీ లలామంబు
పతి మాట రతనాల - పైడి మూట
అడుగు దప్పి ఎరుంగ - దత్త మామల యాఙ్ఞ
అసమాన భక్తి ది - వ్యాను రక్తి
అణు మాత్రమైన బొం - కను మాట ఎరుగదు
కలుష విహీన న - వ్వులకు నైన
కోపంబెరుంగదీ - గుణ వితాన నితాంత
ఒరులెంత తను దూరు - చున్న సుంత


|| తేటగీతి ||

ఈ లతాంగి , సమస్త భూ - పాల మకుట
భవ్య మణి కాంత శబలిత - పాదు డైన
సార్వభౌముని , శ్రీ హరి - శ్చంద్రు భార్య !
దాసిగా , ఈపె , గొనరయ్య - ధన్యులార !!!


ఈ పద్యం వినాలంటే ఇక్కడ నొక్కండి " హరిశ్చంద్ర "

నక్షత్రకుడు అడిగిన సొమ్ము చెల్లించి కాలకౌశికుడు చంద్రమతిని
కొనుక్కుంటాడు ! ఆవుతో పాటే దూడ కూడా ని చెప్పి ఆమెతో
పాటుగా లోహితాస్యుని కూడా తీసుకు పో బోయినప్పుడు
హరిశ్చంద్రుడు :


05) || మత్తేభము ||

కొడుకా ! కష్టము లెన్ని వచ్చినను , నీ - కున్ , నాకు , ఈ కీడు లం
దెడబాటుల్ , ఘటియింప కుండు టొక మే - లే యంచు , నే , సంతసం
బడితిన్ ! కాని , ఎఱుంగ ! నిన్ను, తెగ న - మ్మంజూ పి , హా ! లో హి తా!!!
కడకీ నాటికి , కాల సర్పమునకున్ - గైకోలు

[నాథా ! ఎంతమాటా !! కాల సర్పమా ???
మీ నోట అమంగళ మగు మాటా ???
అమంగళం ప్రతిహత మగు గాక .మా బాబు చిరంజీవి.

నా లోహితుడు చిరంజీవి.]

కడకీ నాటికి , కాలకౌశికునకున్ - గైకోలు గావించుటన్ !!!
కొడుకా !!!!!!!!!!!!!

ఈ పద్యం వినాలంటే ఇక్కడ నొక్కండి " హరిశ్చంద్ర "