Monday, February 14, 2011

ఘంటసాల - పద్యమాల ( కుంతీ కుమారి )

ఘంటసాల
గళం
నుండి
కరుణశ్రీ
కలం
నుండి

జాలువారిన
మరో
మహత్తర
మనోహర
మధుర

కమనీయ
కరుణ

రస భరిత
కావ్య
కాసారం


" కుంతీ కుమారి "

రచన : కరుణశ్రీ
సంగీతం మరియు గానం : ఘంటసాల

01) || చంపకమాల ||

అది రమణీయ పుష్ప వన - మా వన మందొక మేడ , మేడపై
అది యొక మారు మూల గది - ఆ గది తల్పులు తీసి మెల్లగా
పదు నయి దేండ్ల ఈడు గల - బాలిక , పోలిక రాచ పిల్ల , జం
కొదవెడు కాళ్ళ తోడ, దిగు - చున్నది క్రిందికి మెట్ల మీదు గాన్ ! 

ఆ అమ్మాయి ఇటు వైపే వస్తున్నది , ఈ నది వద్ద ఆమెకేం పనో ?

02) || ఉత్పలమాల ||

కన్నియ లాగె వాలకము - కన్పటు చున్నది , కాదు , కాదు ఆ
చిన్ని గులాబి , లేత అర - చేతులలో , పసి బిడ్డ డున్నయ
ట్లున్నది , ఏమి కావలయు - నో గద ఆమెకు , అచ్చు గుద్ది న
ట్లున్నవి రూపు రేఖలెవ - రోయన రాదత డామె బిడ్డయే ! 

ఆమె సంతోష పడుతున్నదా లేక దుఃఖిస్తున్నదా ?

03) || తేటగీతి ||

దొరలు ఆనంద బాష్పాలొ - పొరలు దుఃఖ
బాష్పములొ గాని అవి గుర్తు - పట్ట లేము !
రాలు చున్నవి ఆమె నే - త్రాల నుండి
బాలకుని ముద్దు చెక్కుట - ద్దాల మీద !  

ఓహో ! తెలిసింది !

04) || తేటగీతి ||

గాలి తాకున జలతారు - మేలి ముసుగు
జారె నొక్కింత, అదిగొ చి - న్నారి మోము
పోల్చు కొన్నాములే కుంతి - భోజ పుత్రి
స్నిగ్ధ సుకుమారి ఆమె కుం - తీ కుమారి ! 

05) || మత్తేభము ||

ముని మంత్రంబు నొసంగనేల ? ఇడెబో , - మున్ముందు మార్తాండు ర
మ్మని నే కోరగ నేల ? కోరితినిబో , - ఆతండు రా నేల ? వ
చ్చెనుబో, కన్నియ నంచు నెంచక, ననున్ - చే పట్టగా నేల ? ప
ట్టెనుబో , పట్టి నొసంగ నేల ? అడుగం - టెన్ కుంతి సౌభాగ్యముల్ !

అయ్యో భగవానుడా!!!

06) || తేటగీతి ||

ఈ విషాదాశ్రువుల తోడ - ఇంక ఎంత
కాల మీ మేను మోతు ? గం - గా భవాని
కలుష హారిణి ఈ తల్లి - కడుపు లోన
లిసి పోయెద నా కన్న - కడుపు తోడ !

ఈ విధంగా నిశ్చయించుకొని ,
బిడ్డను రొమ్ముల్లో అదుముకుంటూ
కుంతీ కుమారి నది లోకి దిగి పోతున్నది.

ఇంతలో నదీ తరంగాలలో తేలుతూ ఒక
పెట్టె అక్కడికి కొట్టుకు వచ్చింది.
కుంతీ కుమారి కన్నుల్లో
ఆశాకిరణాలు మెరిసాయి.
ఈశ్వరేచ్చ ఇలా
ఉన్నదని
గుర్తించింది.

ఆమె ఆత్మహత్య
నుంచి విరమించుకొంది.

పెట్టె నిండా ఒత్తుగా
పూలగుత్తులూ ,
చిగురుటాకులూ
పేర్చింది.

మెత్తగా పక్క దిద్ది తీర్చింది.
ఒత్తుకోకుండా చేత్తో ఒత్తి చూచింది

ఎలాగో గుండెలు బిగబట్టుకొని ,
ఎలాగో గుండెలు బిగబట్టుకొని ,
 


07) || తేటగీతి ||

బాష్పముల తాము తడిసిన - ప్రక్క మీద
చిట్టి తండ్రిని బజ్జుండ - బెట్టె తల్లి
బాష్పముల తాము తడసిన - పక్క మీద
చిట్టి తండ్రిని బజ్జుండ - బెట్టె తల్లి !

08) ||తేటగీతి ||

భోగ భాగ్యాలతో తుల - దూగు చున్న
కుంతి భోజుని గారాబు - కూతురు నయి
కన్న నలుసుకు ఒక పట్టె - డన్న మైన
పెట్టుకో నోచ నైతి పా - పిష్థి దాన !

నా చిట్టి బాబూ !!!

09) || ఉత్పల మాల ||

పెట్టియలోన నొత్తి గిల - బెట్టి , నినున్ నడి గంగ లోని కిన్
నెట్టుచు నుంటి తండ్రి , ఇక - నీకును నాకు ఋణంబు తీరె , మీ
దెట్టుల నున్నదో మన య - దృష్టము, ఘోరము చేసినాను , నా
పుట్టుక మాసిపోను , నిను - బోలిన రత్నము నాకు దక్కునే ?

అయ్యో తండ్రీ !!!

10) || ఉత్పలమాల ||

పున్నమ చందమామ సరి - పోయెడి నీ వరహాల మోము , నే
నెన్నటి కైన జూతునె , మ - రే , దురదృష్టము గప్పికొన్న , నా
కన్నుల కంత భాగ్యమును - కల్గునె ? ఏ యమ యైన , ఇంత , నీ
కన్నము వెట్టి , ఆయువిడి - నప్పటి మాట గదోయి నాయనా !!! 

తల్లీ ! గంగా భవానీ !!!!!

11) || తేటగీతి ||

బాల భానుని బోలు , నా - బాలు , నీదు
గర్భమున నుంచు చుంటి, గం - గా భవాని
వీని నేతల్లి చేతిలో - నైన బెట్టి
మాట మన్నింపు మమ్మా , న - మస్సు లమ్మ!!! 

12) || తేటగీతి ||

మరులు రేకెత్త బిడ్డను - మరల మరల
నెత్తు కొనుచు పాలిండ్లపై - నొత్తు కొనుచు !
బుజ్జ గింపుల, మమకార - ముజ్జగించి
పెట్టె లోపల నుంచి, జో - కొట్టె తల్లి !

ఆమె మాతృ హృదయం తట పటా కొట్టు కుంటున్నది పాపం!!!

13) || తేటగీతి ||

ఆత పత్రమ్ము భంగి ,కం - జాత పత్ర
మొండు ,బంగారు తండ్రి పై - ఎండ తగుల
కుండ సంధించి , ఆకులో - నుండి , ముద్దు
మూతిపై , కట్ట కడపటి - ముద్దు నునుచి !


14) || తేటగీతి ||

నన్ను విడి పోవు చుండె మా - నాన్న యనుచు
కరుణ గద్గద కంఠియై , - కంప మాన
హస్తముల తోడ , కాంక్ష ల - ల్లా డ ,కనులు
మూసి కొని , నీటి లోనికి - ద్రోసె పెట్టె !


నదీ తరంగాల్లో పెట్టె కొట్టుకు పోతున్నది!!!!!!!!!!!

15) ||తేటగీతి ||

ఏటి కెరటాలలో పెట్టె - ఏగు చుండ
గట్టు పయి నిల్చి , అట్టె , ని - ర్ఘాంత పోయి
నిశ్చల ,నిరీహ , నీరస, - నిర్ని మేష
లోచనమ్ములతో, కుంతి - చూచు చుండె !!!!!


బాబూ................
మా....నాన్నా..............
............................
..............................
నాన్నా..............................


@@@@@@  సమాప్తం  @@@@@ 

గాన
గంధర్వ
ఘంటసాల

గాన
గాఢాభిమానులకు

స్వాగతం
సుస్వాగతం


అనన్యము
అపురూపము
అమోఘము
అద్భుతము
అసమానము
అద్వితీయము
అయినటువంటి
అమరకావ్యం


" కుంతీ కుమారి "

విని ఆస్వాదించి
ఆనందించి
తరించండి.

click here " Kuntikumari "